జగన్ ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పాలి
సవాల్ చేసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ప్రధానంగా ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిలా రెడ్డి దూకుడు పెంచారు. ఆమె ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, మంత్రులను ఏకి పారేస్తున్నారు. అంతే కాదు మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా వదిలి పెట్టడం లేదు. విమర్శల బాణం ఎక్కు పెట్టారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. వైజాగ్ సమ్మిట్ పేరుతో జగన్ సర్కార్ ఆర్భాటం చేసిందని, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు పని చేస్తున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారని, వాటికి సంబంధించిన వివరాలు చెప్పగలరా అని నిలదీశారు రాష్ట్ర సర్కార్ ను. కొందరిని తనపై ఉసిగొల్పి నిరాధార ఆరోపణలు చేసినంత మాత్రాన తాను ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటం చేసేందుకు సైతం తాను వెనుకాడ బోనంటూ వార్నింగ్ ఇచ్చారు షర్మిలా రెడ్డి. మీ దెబ్బకు పారి పోయిన వ్యాపారవేత్తల గురించి కూడా చెప్పాలన్నారు. దావోస్ కు తెలంగాణ సీఎం వెళితే మీరు ఎందుకు వెళ్ల లేక పోయారో చెప్పాలని నిలదీశారు.