ఏపీలో కళ కళ లాడుతున్న ప్రాజెక్టులు
పొంగి పొర్లుతున్న జలాశయాలు
అమరావతి – భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళ కళ లాడుతున్నాయి. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా చూస్తే శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.
ఇన్ ఫ్లో 4,50,064 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 5,22,318 క్యూసెక్కులు ఉంది. ఇక పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.20 అడుగులు ఉండడం విశేషం. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు వరద నీరు పెరుగుతోంది. ఇన్ ఫ్లో 4,58,393 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 40,560 క్యూసెక్కులు ఉంది.
పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 571.40 అడుగులు ఉందని అధికారులు వెల్లడించారు. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 260.0858 టీఎంసీలుగా ఉందని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడి కాల్వకు 4,034 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,182 క్యూసెక్కులు, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 28,224 క్యూసెక్కుల నీరు విడుదలవుతోం ది. అదే విధంగా ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కులు, వరదకాల్వకు 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.