NEWSANDHRA PRADESH

జెట్ స్పీడ్ తో ఏపీలో అభివృద్ది

Share it with your family & friends

స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు
అమ‌రావ‌తి – సీఎం చంద్ర‌బాబు సార‌థ్యంలో ఏపీ కూట‌మి స‌ర్కార్ డ‌బుల్ స్పీడ్ తో దూసుకు వెళుతోంద‌ని , అభివృద్ది వైపు ఫోక‌స్ పెట్టింద‌న్నారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తున్నామ‌ని అన్నారు. ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పెను భారం మోపింద‌ని వాపోయారు. వాటిని తీర్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నామ‌ని వాపోయారు స్పీక‌ర్.

మంగ‌ళ‌వారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు సుందరకోట పంచాయతీలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గ్రామంలో తొలిసారిగా ప్రవేశించడంతో గిరిజన మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు 2.05 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు.

గ్రామాల్లో సౌరశక్తి ఆధారంగా తాగు నీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. నాతవరం మండలంలో గత ఆరు నెలల్లో రూ. 26.80 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో తాండవ రిజర్వాయర్ గేట్లు, కాలువల మరమ్మత్తుల కోసం రూ. 1.80 కోట్ల నిధులు కేటాయించామన్నారు. 53 వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యమని తెలిపారు. పోలవరం నీటిని తాండవకు తరలించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించారు.

మండలంలోని మూడు హాస్టళ్లకు రూ. 38 లక్షల వ్యయంతో మరమ్మత్తులు చేస్తుండటంతో పాటు విద్యుత్ సమస్యల పరిష్కారానికి అదనపు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. సరుగుడు జలపాతాన్ని పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు వివరించారు.

అర్హులైన గిరిజనులకు భూ పట్టాలను నెలరోజుల్లో పంపిణీ చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వివి రమణ, నాతవరం ఎమ్మార్వో వేణుగోపాల్, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి రమణతో పాటు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *