నర్సీంపట్నం అభివృద్ధిపై స్పీకర్ ఫోకస్
ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలి
అనకాపల్లి – ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పూర్తిగా అభివృద్దిపై దృష్టి సారించారు. నర్సీపట్నం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డులలో నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో స్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు.
నర్సీపట్నం 12 స్మశాన వాటికలను పార్కుల మాదిరిగా అభివృద్ధి చేయడానికి వివిధ ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఉత్తర వాహిని వద్ద వున్న స్మశాన వాటిక ను సీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేపట్టడానికి తీసుకున్నట్లు చెప్పారు. పట్టణ వాసులు ఈ అభివృద్ధి పనులకు ముందుకు రావాలని సూచించారు.
మున్సిపాలిటీ పని తీరుపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కొరతతో అన్ని పనులు నిలిచి పోతున్నాయని ఆవేదన చెందారు. మున్సిపాలిటీ అధికారుల పని తీరు మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు.
నర్సీపట్నం ట్యాంక్ బండ్, కేడీపేట అల్లూరి పార్కు, లమ్మ సింగి గెస్ట్ హౌస్, బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ నెల 30న ఏరియా ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం జరపనున్నారు స్పీకర్.