అసెంబ్లీ ఘటన దురదృష్టకరమన్న అయ్యన్న
అమరావతి – స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటన పట్ల ఆవేదన చెందారు. తాను ఇన్నేళ్లుగా ఇలాంటి సీన్ చూస్తానని అనుకోలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఇలాగేనా వ్యవహరించేది అంటూ వాపోయారు. జగన్ గతంలో సీఎంగా పని చేశారని, కానీ తన పార్టీకి చెందిన నేతలను కంట్రోల్ చేయడంలో విఫలమం కావడం బాధాకరమన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వినకుండా వెళ్లి పోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
మంగళవారం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి అరుస్తూ, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అసెంబ్లీ లో జరిగిన ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ విధంగా వ్యవహరించడం సభ్య సమాజం సిగ్గు పడాల్సిన విషయం అన్నారు. శాసనసభ ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన వేదికగా, అతిథిగా ఆహ్వానించిన గవర్నర్ కు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సభ్యులందరిదని గుర్తు చేశారు.
ఒక ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ అన్నారు. ప్లకార్డ్ లు పట్టుకొని పోడియం వద్ద కాగితాలు చింపి విసరడం, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించేలా ప్రవర్తించడం సాంప్రదాయ విరుద్ధమని స్పష్టం చేశారు.
ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తప్పును తప్పు అని చెప్పకుండా, వారిని ప్రోత్సహించడం మరింత నిరాశాజనకమని అన్నారు.