ఏపీలో 3 లక్షల 20 వేల దొంగ పెన్షన్లు
స్పీకర్ అయ్యన్న పాత్రుడు కామెంట్స్
అమరావతి – స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. వారికి నెలకు రూ. 120 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 1400 కోట్ల ఖర్చవుతోందని అన్నారు.
ఐదేళ్లకు రూ. 7200 కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. వీటితో తాండవ రిజర్వాయర్ లాంటివి మూడింటిని నిర్మాణం చేయొచ్చని అన్నారు స్పీకర్. గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ జగన్ మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా ఈ వ్యవహారం చోటు చేసుకుందని ఆరోపించారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారని, ప్రజలపై భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ఓటు బ్యాంకు ఆధారంగానే దొంగ పెన్షన్లు ఇచ్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు.