కీలక ప్రకటన చేసిన అయ్యన్న పాత్రుడు
అమరావతి – ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం జగన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. అందుకు అసెంబ్లీ రూల్స్ ఒప్పుకోవని వెల్లడించారు. అన్నింటిని పరిశీలించామని తెలిపారు. తాను కోర్టుకు వెళ్లినా చేసేది ఏమీ ఉండదన్నారు.
ఇప్పటికే తనకు లేఖ రాశారని, అందులో బెదిరింపు ధోరణితో ఉందన్నారు. కానీ తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదన్నారు స్పీకర్. తాజాగా స్పీకర్ ఇచ్చిన రూలింగ్ కలకలం రేపింది వైసీపీ వర్గాల్లో. కాగా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు జగన్ మోహన్ రెడ్డి.
ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, తాము చేసే తప్పులను ప్రజలకు తెలియ నీయకుండా చేసేందుకు తనను అసెంబ్లీకి రానివ్వకుండా చేశారంటూ ఆరోపించారు వైసీపీ బాస్. తాము తప్ప సభలో ఎవరూ లేరని, గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు జగన్ రెడ్డి. దీనిపై తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఒక బాధ్యత కలిగిన నాయకుడై ఉండి ఇలాగేనా లేఖ రాసేది అంటూ మండిపడ్డారు.