స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. గ్రామ స్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ప్రతి మండలంలో ఒక గ్రామంలో రోజుకు ఒకసారి సమావేశాలు జరుగుతాయని తెలిపారు. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు స్పీకర్. తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ వీఆర్ఓ, మండల సర్వేయర్ వంటి అధికారులు సమావేశాల్లో పాల్గొంటారని చెప్పారు. అవసరమైతే ఇతర శాఖల అధికారులను కూడా పిలుస్తారని పేర్కొన్నారు. ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
గత ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల డాక్యుమెంట్లు, ధరఖాస్తులు తీసుకు రావాలని, రశీదు ఇవ్వబడుతుందని చెప్పారు. 45 రోజుల్లో సమస్యల పరిష్కారం ఉంటుందన్నారు.
సభల అనంతరం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ టీం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం పరిశీలించి నివేదిక అందజేస్తుందని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.