విద్యతోనే వికాసం – స్పీకర్
టీచర్లది కీలకమైన పాత్ర
అమరావతి – విద్యతోనే వికాసం అలవడుతుందని అన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. నాతవరం మండలం డి ఎర్రవరంలో, మాకవరపాలెం మండలం తామరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే సమావేశం అట్టహాసంగా జరిగింది. స్పీకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్పీకర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులను అందజేశారు. ఏ సబ్జెక్టులో వీక్‌గా ఉంటే ఆ అంశంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
ఈ కార్యక్రమం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 35,84,000 మంది విద్యార్థులు చదువు కుంటున్నారని, 71,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,266 ఉపాధ్యాయులు, 50,000 ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వివరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, విద్యా పరంగా ఉన్న స్థితిని అర్థం చేసుకోవడానికి ఈ సమావేశం ఉపయోగ పడుతుందని చెప్పారు. పిల్లలను టీవీ, ఫోన్లకు దూరంగా ఉంచేందుకు సమయపట్టిక అమలు చేయాలని సూచించారు.
గ్రామాల్లో చదివే విద్యార్థులను తక్కువ అంచనా వేయకూడదని, అక్కడి నుంచే డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అవుతున్నారని స్పీకర్ తెలిపారు. తన విద్యాభ్యాసం కోసం కాకినాడ వెళ్లాల్సి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. నర్సీపట్నంలో విద్యా సంస్థల అవసరాన్ని నెరవేర్చేందుకు జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, రెసిడెన్సీ కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, ఐటిఐ కాలేజీ ఏర్పాటు చేశామని వివరించారు.
నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లకు అవసరమైన ఫర్నిచర్, మౌలిక సదుపాయాలను సి ఎస్ ఆర్ గ్రాంట్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌లను దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు.
పాఠశాలకు దగ్గరగా ఉండి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని స్పీకర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు, వారి విద్యా అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వివి రమణ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.