టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్
యాదవ్ ను నియమించిన చంద్రబాబు
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు. టీడీపీ అంటే కేవలం కమ్మ కులస్థులకే పెద్ద పీట వేస్తారంటూ వచ్చిన ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టారు చంద్రబాబు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడింది. ఊహించని రీతిలో 175 స్థానాలకు గాను 164 స్థానాలను సాధించింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. జగన్ రెడ్డి పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేయడంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉండగా టీడీపీని విశాఖలో విజయ పథంలో నడిపించారు పల్లా శ్రీనివాస్ యాదవ్. ఈ మేరకు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. కాగా ఇప్పటి వరకు ఏపీ టీడీపీ చీఫ్ గా అచ్చెన్నాయుడు పని చేశారు. ఆయన ప్రస్తుతం కేబినెట్ లోకి చేరడంతో పార్టీ పదవి పల్లాకు దక్కింది.