Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHప‌రుగులు తీస్తున్న100 రోజుల ప్ర‌ణాళిక‌

ప‌రుగులు తీస్తున్న100 రోజుల ప్ర‌ణాళిక‌

హామీల అమలుకు వివిధ శాఖల ప్రతిపాదనలు

అమరావతి : రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ దూకుడు పెంచింది. ఇచ్చిన హామీల అమ‌లుపై ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగా 100 రోజుల ప్లాన్ కు శ్రీ‌కారం చుట్టారు . ఆదేశాలు జారీ చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

ఇందులో భాగంగా చేపట్టే ప్రాధాన్య కార్యక్రమాల ప్రతిపాదనలను వివిధ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. ఇప్పటి వరకు 35 అంశాలను నివేదించాయి. ఇందులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని శాఖల కార్య క్రమాలు, పథకాలను నివేదించే అవకాశముంది.

వీటిలో కీలకమైన బీసీలకు రక్షణ చట్టం, గంజాయి, మాదక ద్రవ్యాల‌ నియంత్రణ, రాజధాని అమరావతిలో అసంపూర్తి నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకోనుంది. 90 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాల అందజేత, విశాఖను ఆర్ధిక రాజధానిగా ప్రకటన, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయింపు చేయాల‌ని ప్ర‌తిపాదించాయి శాఖ‌లు.

తల్లిదండ్రులపై భారం లేకుండా కళాశాలలకే ఫీజు చెల్లింపు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఎంఎస్ఎంఈ సెక్టార్లో ప్రోత్సాహకాల ప్రకటన, గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులపై విచారణ అంశాలూ ఉన్నాయి .

వీటన్నింటి పై ప్రభుత్వం చర్చించి, మార్పులు, చేర్పులు చేసి ఆ తర్వాత ముందుకు వెళ్లనుంది. ఆయా శాఖల వారీగా వచ్చిన మరికొన్ని ప్రతిపాదనలు చేశాయి. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ పై తీర్మానం చేసి కేంద్రానికి పంపడం.

కాపు భవన్ నిర్మాణాల పూర్తికి చర్యలు..నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు, క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తుల అభివృద్ధి బోర్డు, ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమ కార్పొరేషన్, తోట‌ చంద్రయ్య, ఇతరుల హత్యలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌తిపాదించాయి.

అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లింపు, సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, గౌరవ వేతనాల పెంపు పరిశీలన, ఆశా కార్యకర్తల వేతనాలు పెంపు పరిశీలన , డిజిటల్ ఆరోగ్య కార్డుల కార్యక్రమం ప్రారంభం, గుండె వైద్య పరీక్షలు, చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు, ,అంబేడ్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ. జూనియర్ లాయర్ల స్టైఫండ్ పెంపు, శాశ్వత కుల ధ్రువపత్రాలు అందజేత కూడా ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments