ఏపీ టెట్ ఫలితాలపై ఉత్కంఠ
ఇవాళే విడుదల కానున్న వైనం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు రానుంది. ఉపాధ్యాయులు కావాలని అనుకునే వారికి ఇప్పటికే ఏపీ సర్కార్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించింది. ఇందుకు సంబంధించి టెట్ ఫలితాలు నవంబర్ 4వ తేదీన విడుదల కానున్నాయి. ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇవాళ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా వెల్లడించింది.
ఉదయం 11.30 గంటలకు ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేస్తారు. అక్టోబరులో జరిగిన టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 58,639 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. మిగిలిన 3,68,661 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
బుధవారం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తున్న నేపథ్యంలో టెట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది. టెట్‌లో అర్హత సాధించిన వారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అంతకు ముందు టెట్ అర్హత సర్టిఫికెట్ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటయ్యేది. 2022 నుంచి దీన్ని జీవిత కాలానికి మార్చారు. 2022 టెట్‌లో చాలా మంది అర్హత సాధించినా మార్కుల్లో మెరుగుదల కోసం చాలా మంది ఇప్పుడు మరోసారి పరీక్ష రాశారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో టెట్ కు ప్రాధాన్యత పెరిగింది.