బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్య లోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువు దీరే ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రం లోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు.
బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించ కూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు.