ముగిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు
అప్పలాయగుంటలో ఘనంగా పూర్ణాహుతి
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుపతి పరిధిలోని అప్పలాయగుంట పుణ్యక్షేత్రం లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పలాయగుంట ఆలయ ఈవో ఏర్పాట్లు చేశారు.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేపట్టారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటలకు తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణబట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.