నిప్పులు చెరిగిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణ ప్రదంగా తీసుకు వచ్చిన ఆరోగ్య శ్రీ పథకం ఆగి పోయే ప్రమాదం నెలకొందన్నారు. వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు చెల్లించక పోవడంతో ఆరోగ్యశ్రీ పథకం ఆపివేస్తున్నామని ఆసుపత్రుల నిర్వాహకులు అల్టిమేటం ఇచ్చారని , దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చంద్రబాబు గొప్పలు చెప్పారని ఇప్పుడేమో ఆరోగ్య శ్రీ కి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ సైతం నిర్వీర్యం చేశారని ఆరోపించారు. జగన్ హయాంలో దాదాపు రూ.1600 కోట్లు పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. గత 11 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించక పోవడం దారుణమన్నారు.
ఆరోగ్య శ్రీ పథకం వైద్య విధానంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు వైఎస్ షర్మిల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోతే 25 మంది ఎంపీలు బీజేపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నట్లు అని మండిపడ్డారు.