నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
విజయవాడ – ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహారీలకు మేలు చేకూర్చేలా ప్రయారిటీ ఇచ్చారని, ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఏపీ రాష్ట్రానికి రిక్తహస్తం చూపించారంటూ ధ్వజమెత్తారు. కొండంత రాగం తీసి కూసంత పాట పాడిన చందంగా బడ్జెట్ ఉందంటూ మండిపడ్డారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు కలిగిన నితీశ్ కుమార్ బడ్జెట్ లో అగ్ర తాంబూలం అందుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
విచిత్రం ఏమిటంటే 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిప్ప చేతిలో పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ను అందలం ఎక్కించి ఆంధ్రకు గుండు సున్నా ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారంటూ సీరియస్ అయ్యారు. బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారంటూ మండిపడ్డారు. రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన రుణం తప్పా.. ఇప్పుడు రూపాయి సహాయం లేదన్నారు.