కూటమి సర్కార్ పై భగ్గుమన్న షర్మిల
అమరావతి – కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కొలువు తీరి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారని, ఇప్పుడు దాని గురించి మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలప్పుడు మహిళలను లక్షలాధికారులను చేస్తామని నమ్మించారని, తీరా గెలిచాక వారి గురించి పట్టించు కోవడం మానేశారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు కండీషన్స్ అప్లై అంటూ కొత్త రాగం ఎత్తుకోవడం పట్ల సీరియస్ అయ్యారు .
శుక్రవారం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు అంటూ విమర్శించారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం చేయడమేనని అన్నారు. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి అంటూ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారని అన్నారు.. కమిటీల పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారని ధ్వజమెత్తారు పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమేనని అన్నారు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంత దూరమైనా జీరో టికెట్ తో వెళ్లే ఛాన్స్ ఉందన్నారు.