హైద్రాబాద్ లో ఎయిర్‌పాడ్‌ల తయారీ
ప్రకటించిన దిగ్గజ మొబైల్ సంస్థ
హైదరాబాద్ – ప్రపంచ దిగ్గజ మొబైల్ , యాక్సెసరీ తయారీ సంస్థ యాపిల్ సంచలన ప్రకటన చేసింది. భారత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో యాపిల్ కు సంబంధించిన ఎయిర్ పాడ్ ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ తయారీ వచ్చే ఏడాది 2025 నుంచి ప్రారంభం కానుందని యాపిల్ సంస్థ ప్రకటించింది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.
ఈ విషయాన్ని యాపిల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకించి బెంగళూరు, ముంబై నగరాల కంటే హైదరాబాద్ మౌలిక సదుపాయాల కల్పనలో కొంత బెటర్ అని భావించింది . ఈ సందర్బంగా యాపిల్ తయారీ సంస్థ ఎయిర్ పాడ్ ల తయారీ (అసెంబుల్డ్ ) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం పెట్టుబడిదారులు, కంపెనీలకు సాదర స్వాగతం పలుకుతున్నామని, ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రావచ్చని ఇప్పటికే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను తాము ఏర్పాటు చేస్తామన్నారు.