ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్
తన వదినె వైఎస్ భారతీ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ పట్ల సీరియస్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అన్నారు. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదన్నారు.. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్నారు.ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాల్సిందేనన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, తెలుగుదేశం పార్టీలేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.
సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని వాపోయారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారన్నారు.. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారని అన్నారు. వివాహేతర సంబంధాలను అంటగట్టారని వాపోయారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఈ దారుణ సంస్కృతిని వెలి వేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.