త్వరలో ఏపీఎస్ఆర్టీసీలో జాబ్స్ జాతర
7,545 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఛాన్స్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా సంస్థలు, శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ తమ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
ఈ మేరకు మొత్తం ఏపీఎస్ఆర్టీసీలో 7,545 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది మొత్తం 18 కేటగిరీలలో ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 3,673 రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు, 280 డిప్యూటీ
సూపరింటెండెంట్ ,656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వానికి తెలిపింది ఏపీఎస్ఆర్టీసీ.
ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపితే వెంటనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ పరంగా కొత్త బస్సుల కొనుగోలు చేయాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.