ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
అమరావతి – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ). ఇప్పటికే తీపి కబురు చెప్పింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్లతో పాటు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన సీనియర్ సిటిజన్లు ఎవరైనా సరే తమ సంస్థ బస్సులలో ప్రయాణం చేయొచ్చని, వారికి నిర్దేశించిన రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
వయసు పైబడిన వారికి శుభవార్తనే చెప్పవచ్చు. ఈ మేరకు ఆర్టీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే సోమవారం ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చింది. బస్సులలో ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్లు తమకు చెందిన గుర్తింపు కార్డులు చూపినా ఓకే చేస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చని తెలిపింది ఏపీఎస్ఆర్టీసీ. ఒరిజినల్ గుర్తింపు కార్డు మర్చిపోతే మొబైల్ ఫోన్లో డిజిటల్ కార్డు చూపించవచ్చని స్పష్టం చేసింది.