భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు
తిరుమల – భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివున్న నేపథ్యంలో తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనికీ చేశారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి విజయకుమార్ మాట్లాడుతూ, తిరుమలలో ఇప్పటి నుండి ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా వుందో దుండగులకు ఒక హెచ్చరిక లాగా, స్వామి వారి భక్తులకు భరోసా లాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో ఆక్టోపస్, పోలీస్, టిటిడి నిఘా, భద్రత సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఏరియా డామినేషన్ భద్రత సిబ్బంది నాలుగు గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ, ఆర్ టిసి బస్టాండ్, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాలు, ఎంబిసి , శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
ప్రతిరోజు తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విజిఓ సురేంద్ర, ఆక్టోపస్ డిఎస్పి విశ్వనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.