NEWSNATIONAL

లిక్క‌ర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్

Share it with your family & friends

రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన సీబీఐ

న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆప్ చీఫ్ , ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ బుధవారం అరెస్టయ్యారు. రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది.

న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉప సంహరించుకున్నారు.

మనీ లాండరింగ్ కేసులో ఊరటనిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు చేసింది. అయితే హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతో హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇప్పుడా పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందంటూ మార్చి 21న ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఉదయం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన సీబీఐ కస్టడీ కోరింది.

స్పందించిన కోర్టు.. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఇప్పటి వరకు కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని లేవనెత్తింది. ఈ నేపథ్యంలో సీబీఐ న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేజ్రీవాల్ అరెస్ట్‌కు కోర్టు సమ్మతించింది.