హర్యానాలో ఆప్ దే అధికారం – కేజ్రీవాల్
పవర్ లోకి వస్తే ఉచితంగా విద్యుత్ సరఫరా
హర్యానా – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన హర్యానా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆప్ ఆధ్వర్యంలో హర్యానా లోని దబ్వాలీలో చేపట్టిన భారీ ర్యాలీలో ప్రసంగించారు.
హర్యానా రాష్ట్ర ప్రజలకు తాను పెద్ద కొడుకునని చెప్పారు. తనను నిర్వీర్యం చేయాలని, ఢిల్లీలో ఆప్ సర్కార్ ను కూల్చాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసిందని, కానీ వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు అరవింద్ కేజ్రీవాల్.
నన్ను నానా రకాలుగా హింసించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు అక్రమంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో ఆధారాలు లేకుండానే జైలుపాలు చేసిందని ఆరోపించారు. ఆరు నెలల పాటు తాను తీహార్ చెరసాలలో నరకం అనుభవించానని చెప్పారు కేజ్రీవాల్. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తనకు మందులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు మాజీ సీఎం.
కాషాయ సంస్థలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కుట్రలు పని చేయవని అన్నారు. హర్యానాలో ఈసారి ఆప్ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అధికారంలోకి వస్తే ఉచితంగా విద్యుత్ అందజేస్తామని చెప్పారు.