నా భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే – సీఎం
అవినీతి పరుడినో కాదో త్వరలో తేలుతుంది
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హర్షధ్వానాల మధ్య సంచలన ప్రకటన చేశారు అరవింద్ కేజ్రీవాల్.
తాను రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్మయానికి గురి చేశారు. తనపై , పార్టీపై గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయం ఒక్కటే తనకు కనిపించిందని, అది కేవలం తన పదవి నుంచి తప్పుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు కేజ్రీవాల్.
ప్రస్తుత రాజకీయాలలో వార్డు మెంబర్, కౌన్సిలర్ పదవిని కూడా వదులు కోవడానికి సిద్దపడని ఈ రోజుల్లో తాను ఏకంగా ముఖ్యమంత్రి పదవిని వీడేందుకు సిద్దమై ఉన్నానని స్పష్టం చేశారు. తాను కానీ ఇతర నేతలు కానీ ఎవరూ కూడా పదవుల కోసం పాకులాడిన దాఖలాలు లేవన్నారు.
అవినీతి ఆరోపణల కారణంగానే బలపరీక్షను ఎదుర్కొని సీఎం పీఠాన్ని వదులు కోవాలని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్.
తాను నిజాయితీ పరుడినా లేక అవినీతి పరుడినా అన్నది త్వరలోనే రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తేలి పోతుందని, ఈ మేరకు ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు సీఎం.