ఆరోపణలు చేస్తే మోదీని అరెస్ట్ చేస్తారా
కోర్టులో నిప్పులు చెరిగిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇదే కేసుకు సంబంధించి రాస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై వాదోప వాదనలు కొనసాగాయి. న్యాయమూర్తి ముందు సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్వంతంగా తన వాదనలు వినిపంచే ప్రయత్నం చేశారు అరవింద్ కేజ్రీవాల్. తనకు డబ్బులు ఇచ్చారంటూ ఆరోపించారు. ఎక్కడా ఇచ్చినట్లు రుజువులు లేవన్నారు. తనను అరెస్ట్ చేశారని వాపోయారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి మోదీపై సంచలన కామెంట్స్ చేశారు. ఒకవేళ తాను గనుక డబ్బులు మోదీకి ఇచ్చినట్లు ఆరోపిస్తే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు.
కేవలం తనను ఇరికించడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. సీబీఐ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 31 వేల పేజీలు , ఈడీ 25 వేల పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందన్నారు. అందులో ఎక్కడా తన పేరు ప్రత్యేకంగా ప్రస్తావించ లేనే లేదన్నారు. అయినా తనను అదపులోకి తీసుకున్నారంటూ ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని మండిపడ్డారు.