ప్రజా యుద్ద నౌకకు మరణం లేదు
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
సంగారెడ్డి జిల్లా -ప్రపంచంలో పాట ఉన్నంత కాలం ప్రజా యుద్ద నౌక గద్దర్ బతికే ఉంటారని, ఆయనకు మరణం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. గద్దర్ అంటేనే ఓ చైతన్యం అన్నారు. కోట్లాది మందిని తన ఆట పాటలతో ప్రభావితం చేసిన అద్భుతమైన గాయకుడని కొనియాడారు. మలి దశ ఉద్యమానికి గద్దర్ ఊపిరి పోశాడని ప్రశంసించారు.
గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆదివారం గద్దర్ రచనల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పదవుల కోసం వెంట పడకుండా తన తండ్రిని స్మరించుకునేలా తనయుడు సూర్యం పుస్తకాలు తీసుకు రావడం ప్రశంసనీయమని అన్నారు తన్నీరు హరీశ్ రావు.
ప్రతి సందర్భంలోనూ , ప్రతి పోరాటంలోనూ , ఉద్యమాలలోనూ గద్దర్ కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. అన్ని ఉద్యమాలలో తనే ముందుండి నడిపించాడని , ఆయన పేరు ఎత్తకుండా తెలంగాణ లేదన్నారు మాజీ మంత్రి. మలిదశ పోరాట సమయంలో గద్దర్ తో కలిసి నడిచే అవకాశం తనకు దక్కిందన్నారు.