కొంపెల్లపై ఓవైసీ కన్నెర్ర
విద్వేష పూరిత రాజకీయాలు చెల్లవు
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరామ నవమి సందర్బంగా నిర్వహించిన శోభా యాత్రలో బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత చార్మినార్ పై బాణం ఎక్కుపెట్టే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదులో ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
దీనిపై తీవ్రంగా స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ. భారతీయ జనతా పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఒక బాధ్యత కలిగిన అభ్యర్థి ఇలాంటి చౌకబారు చేష్టలకు దిగడం దారుణమన్నారు ఓవైసీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ప్రజలు ఎవరికి ఓటు వేయాలన్నది నిర్ణయం తీసుకుంటారని, విద్వేష పూరిత రాజకీయాలు చేయడం వల్ల ఓట్లు రావని , ఈ నిజం తెలుసుకుంటే మంచిదన్నారు. కొంపెల్ల మాధవీలత తనను టార్గెట్ గా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తుండడం దారుణమన్నారు. తమకు కూడా మాటలు వస్తాయని, కానీ సభ్యత కాదని ఊరుకున్నానని అన్నారు.
రెచ్చగొట్టేలా ప్రదర్శించిన కొంపెల్ల మాధవీలతపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు.