రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు
ప్రకటించిన రైల్వే మంత్రి అశ్విని
న్యూఢిల్లీ – ఏపీకి ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రయారిటీ లభించింది. ప్రత్యేకించి రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులకు సంబంధించి వివరాలు తెలిపారు.
భారతీయ రైల్వేలకు 2024-25 సంవత్సరానికి గాను రూ. 2,52,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ‘ సబ్కా సాథ్ సబ్కా వికాస్’పై దృష్టి సారించినట్లు చెప్పారు. రైల్వేలలో సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా 3 ముఖ్యమైన ఎకనామిక్ రైల్వే కారిడార్ ప్రాజెక్టులను అమలు చేస్తామని, ఫలితంగా రాబోవు 6 నుండి 8 సంవత్సరాల వ్యవధిలో 40,000 కి.మీ. ట్రాక్ నిర్మించడం జరుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి గాను రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి మొత్తం పెట్టుబడి రూ. 68,059 కోట్లు అని, రాష్ట్రంలో 97 శాతం విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ఈ ప్రాంతంలో 2009-14లో ఏటా 70 కిలోమీటర్ల ట్రాక్ మాత్రమే వేయడం జరిగిందని, కాని ప్రస్తుతం ప్రతి సంవత్సరం 246 కిలోమీటర్ల రైల్ ట్రాక్‌ను వేస్తున్నట్లు తెలిపారు.