పొత్తులపై త్వరలో క్లారిటీ
టీడీపీ, జనసేన పార్టీల నేతలు
అమరావతి – టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ప్రకటించారు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ ఇద్దరు నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. పొత్తులకు సంబంధించి ఖరారు చేసేందుకు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని, అందుకే హస్తినకు బయలుదేరి వెళ్లారని చెప్పారు. ఢిల్లీలో పెద్దలను కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై పూర్తి వివరాలు త్వరలోనే బయట పెడతామని తెలిపారు. మిగతా వాటిపై కూడా స్పష్టత అనేది రానుందన్నారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ రాత్రికి హస్తినాపురంకు చేరుకుంటారని పేర్కొన్నారు. పొత్తులపై రేపటి లోగా క్లారిటీ వస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. వైసీపీ నేతలు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పొత్తు ఉండదని ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్.