NEWSANDHRA PRADESH

సోమిరెడ్డిపై హత్యా యత్నం బాధాకరం

Share it with your family & friends

ఏపీ టీడీపీ చీప్ కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి – మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ గూండాలు దాడి చేయ‌డం దారుణ‌మ‌న్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. ఈ దాడి వైసీపీ నేతల సైకో చేష్టలకు నిదర్శనమ‌ని పేర్కొన్నారు. సోమిరెడ్డిపై వైసీపీ నేత వెంకటయ్య, అతని అనుచరులు దాడి చేయడం దుర్మార్గమ‌న్నారు.

టీడీపీ సమావేశం వద్ద వైసీపీ నేతలు కర్రలు, రాడ్లతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. సోమిరెడ్డిపై హత్యా యత్నాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో.. టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశార‌ని, కారు అద్దాలు ధ్వంసం చేశార‌ని ఆరోపించారు.

దాడులు చేసే వారిని, హత్యలు చేసే వారిని జగన్ రెడ్డి ప్రోత్సహించడం వల్లనే వైసీపీ గూండాలు పెచ్చు మీరి పోతున్నారని మండిప‌డ్డారు. గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై రకరకాల ఆరోపణలు చేసి, ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ కోర్టు నుండి మాయం చేశారని మండిప‌డ్డారు.

ఇప్పుడు ఏకంగా సోమిరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించడం వెనుక స్థానిక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. ఈ ఘటనకు స్థానిక మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంద‌న్నారు. దాడులు చేస్తాం, హత్యలు చేస్తామంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు.

జగన్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ ముఠా చేసిన ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుంచు కోవాల‌ని హెచ్చ‌రించారు.