ఆంధ్రా యూనివర్శిటీ వీసీ రాజీనామా
రిజిస్ట్రార్ స్టీఫెన్ సన్ కూడా గుడ్ బై
అమరావతి – రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకమైన పదవులు పొందిన వారంతా ఇప్పుడు రాజీనామా బాట పట్టారు. ఇంకొందరు సీఎం చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
తాము ఎవరినీ ఉపేక్షించ బోమంటూ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తిరుమలలో రాజకీయాలకు వేదికగా మార్చేసి ఫక్తు వైసీపీకి అనుకూలంగా , టీటీడీని సర్వ నాశనం చేశారన్న ఆరోపణలు ఉన్న ఈవో ధర్మా రెడ్డిపై వేటు వేశారు. ఆయన స్థానంలో ఈవోగా జె. శ్యామలా రావుకు బాధ్యతలు అప్పగించారు.
ఇదిలా ఉండగా కీలకమైన ఆంధ్రా యూనివర్శిటీ వీసీగా ఉన్న ప్రసాద రెడ్డితో పాటు రిజిస్ట్రార్ స్టీఫెన్ సన్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇన్ చార్జి రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ కిషోర్ బాబు బాధ్యతలు చేపట్టారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి అండ చూసుకుని వీసీ ప్రసాద రెడ్డి యూనివర్శిటీని భ్రష్టు పట్టించారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి.