సంతాపం తెలిపిన ప్రధాని మోడీ..సీఎం యోగి
ఉత్తర ప్రదేశ్ – యూపీ అయోధ్యలోని రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. ఆచార్య దాస్ కు ఛాతిలో నొప్పి రావడంతో లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు. సీనియర్ వైద్యులు ప్రయత్నం చేసినా ఫలితం లేక పోవడంతో ఇవాళ మృతి చెందారు. ఆయన లోకాన్ని వీడడం పట్ల విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంఎస్ దాస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ గత 1993 నుండి రాం లాలాకు సేవ చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. జనవరి 29న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అయోధ్యలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 4న లక్నోకు మార్చారు.
ఎంఎస్ దాస్ మరణాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సంవాద్ కేంద్రం ప్రకటించింది. ప్రధాన పూజారి మాఘ పూర్ణిమ రోజున ఉదయం 7 గంటలకు మరణించారని ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ , ఆలయ వ్యవస్థతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ప్రధాన పూజారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సత్యేంద్ర దాస్ మృతికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. గొప్ప రామభక్తుడు, శ్రీ రామ జన్మభూమి ఆలయం, శ్రీ అయోధ్య ధామ్ ప్రధాన పూజారి ఆచార్య శ్రీ సత్యేంద్ర కుమార్ దాస్ జీ మహారాజ్ మరణం చాలా విచారకరమన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని నష్టం. వినయపూర్వకమైన నివాళులు అంటూ పేర్కొన్నారు.