రాముడి కోసం భక్త సందోహం
అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు
ఉత్తర ప్రదేశ్ – అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడి ఆలయం భక్తులతో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముడి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అయోధ్య రామ మందిరం ట్రస్టు ఆధ్వర్యంలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు. దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్యం, క్రీడా రంగాలకు సంబంధించి ప్రముఖులు హాజరయ్యారు.
దేశంలోని పీఠాధిపతులు, స్వాములు కూడా హాజరయ్యారు. మోదీ ప్రారంభించిన తర్వాత భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనా. భారీ ఎత్తున భక్తులు అయోధ్య ఆలయానికి, శ్రీరాముడికి విరాళాలు, కానుకలు అందజేస్తుండడం విశేషం.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్టు చర్యలు చేపట్టింది. యోగి ప్రభుత్వం సైతం చర్యలు చేపట్టింది. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసింది.