కోటి 55 లక్షల మందికి దీపం
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకానికి కోటి 55 లక్షల మంది ఉన్నారని, వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేసినట్లు తెలిపారు.
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో దీపం 2 పథకాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులతో మాట్లాడుతూ, ఈ పథకం అమలుకు వచ్చే ఐదేళ్లలో ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 11,630 ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
1999 లోనే మహిళలకు గ్యాస్ పంపిణీ ప్రారంభించి దీపం పథకానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడి కృషిని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల హామీ మేరకు దీపం 2 పథకాన్ని దీపావళి సందర్భంగా ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ పథకం కింద ప్రతి ఏడాది మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామని, ఇది రాబోయే ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన వివరించారు. దీని కోసం తెల్ల రేషన్ కార్డుతో పాటు బ్యాంక్ లింక్ కలిగిన ఖాతా , వినియోగంలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఉండాలని సూచించారు.
వాలంటీర్ల సాయం లేకుండానే పింఛన్ల పంపిణీ 98 శాతం పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే నర్సీపట్నం నియోజకవర్గానికి రూ. 41 కోట్లు అభివృద్ధి నిధులుగా కేటాయించినట్లు చెప్పారు.
స్థానిక టీడీపీ నాయకులు మండల స్థాయి అధికారులతో కలిసి పనులు చురుకుగా చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వివి రమణ, తాసిల్దార్ రామారావు, జడ్పిటిసి రమణమ్మ, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సూర్యచంద్ర, టిడిపి నాయకులు నాని బాబు, శ్రీరంగస్వామి,అధికారులు పాల్గొన్నారు.