ప్రజా శాంతి పార్టీలో చేరిన నటుడు
సర్ ప్రైజ్ ఇచ్చిన బాబు మోహన్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉన్నట్టుండి ఏపీ, తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు బాబు మోహన్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. ఆయన అందరికీ షాక్ ఇస్తూ డాక్టర్ కేఏ పాల్ పంచన చేశారు. ఈ మేరకు ప్రజా శాంతి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా బాబు మోహన్ కు కండువా కప్పి ప్రజా శాంతి పార్టీలోకి చేర్చుకున్నారు ఆ పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్. ఈ సందర్బంగా పాల్ మాట్లాడారు. అన్ని పార్టీలు కలుషితమై పోయాయని, ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని, ఆచరణకు నోచుకోని హామీలు గుప్పిస్తూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముందు నుంచీ తమ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తోందన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు డాక్టర్ కేఏ పాల్. ఇదిలా ఉండగా ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తాను విశాఖ పట్టణం నుంచి , బాబు మోహన్ వరంగల్ నుంచి పోటీ చేస్తారని చెప్పారు.