కిషన్ రెడ్డిపై బాబు మోహన్ ఫైర్
నిప్పులు చెరిగిన ప్రముఖ నటుడు
హైదరాబాద్ – మాజీ మంత్రి , భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు , ప్రముఖ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిపై భగ్గుమన్నారు. కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తనను కావాలని పొమ్మనకుండా బయటకు వెళ్లేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ల కారణంగా తాను సినిమా రంగానికి సంబంధించి చాలా అవకాశాలను కోల్పోయానని పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి తనపై కక్ష కట్టారని, ఆయన వల్లనే తాను బయటకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు. ఇలాంటి వాళ్ల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని మండిపడ్డారు. తాను పార్టీ కోసం అలుపెరుగకుండా కృషి చేశానని స్పష్టం చేశారు.
వీళ్లు పెద్ద మనుషులు కాదన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జెడ్పీటీసీలను గెలిపించ లేని వాళ్లు తయారయ్యారని ధ్వజమెత్తారు బాబు మోహన్.