DEVOTIONAL

సూర్యప్రభ వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Share it with your family & friends

బద్రి నారాయణుడి అలంకారంలో శ్రీ‌వారు

తిరుమల – తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామి వారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి వారు అనుగ్ర‌హిహించారు.

వాహన సేవలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామల రావు దంప‌తులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీధర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అక్టోబరు 11న రథోత్సవం

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామి వారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.