జడ్సన్ రాయని పద్యం సంచలనం
సోషల్ మీడియాలో హల్ చల్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ వర్కర్ గా , నాయకుడిగా గుర్తింపు పొందిన బక్క జడ్సన్ ఇప్పుడు సంచలనంగా మారారు. ఆయనను ఆరు ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇందుకు సంబంధించి జడ్సన్ రాయని పద్యం పేరుతో రాసిన కవితకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కొరవడిందని, కుల అహంకారం, ఆధిపత్యం కొనసాగుతోందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా జడ్సన్ కు మద్దతుగా రాసిన పద్యం ఇలా ఉంది. ‘ఒరేయ్ మీరే ఏలండిరా రాజ్యాలు, మట్టి మనుషులను అణచి వేసి , నామ రూపాలు లేకుండా చేసి , జీవచ్ఛవాలుగా మీరే ఏలండిరా. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు , మీలో మీరే అమ్మ అక్క బూతులు తిట్టుకోండిరా. మీరే తన్నుకోండి పార్టీని మీరే పంచుకోండి.
మీ మలినాన్ని మోస్తున్నందుకు , మీము వేల ఏండ్ల నుంచే , ఊరవతల విసిరేయ బడ్డోల్లం, బహిష్కరణ మాకు కొత్తగాదురా..మీ దోపిడీకి బలైపోతున్న సమాజం లో నిలబడి కొడవళ్లు ఎత్తిన ప్రతీసారి కొవ్వొత్తులై కరుగుతానే ఉన్నాం.
మమ్మల్ని మేము విముక్తం చేసుకునే ప్రతి సందర్భంలో వివక్షను ఎదుర్కుంటూనే వున్నాం..ఏ బహుజనుల త్యాగాల మీద , ఏ దళితుల ప్రాణాల పునాదుల మీద , నా కాంగ్రేస్ పార్టీ నిలబడ్డదో , దాని మూలాలను పెకిలిస్తున్నమీకు , బహుజన బిడ్డ ఉసురు తప్పకుంటా తగులుతుంది..
కాళ్లుండి వంకర నడక నడుస్తున్న , మిమ్మల్ని సక్కగ జేయాల్నని చూసిన , ఓ అవిటివాన్ని బయటకు గెంటేయాల్నని చూసిన మీ దుర్మార్గం బద్దలుకాక తప్పదు..అకారణంగా ఓ అశక్తుణ్ణి హింసించిన వాడెవడూ సుఖ పడబోడని” భారతం ఏనాడో చెప్పింది మీకు ఆగతి తప్పదు..
ఒక్క బక్కోడైన బక్క జడ్సన్ ను , మీరు బహిష్కరించినమని సంబుర పడుతుర్రేమో..
మీరు గెంటివేసింది , ముక్కోటి తెలంగాణ బహుజన ఆత్మలను , మీరు బహిష్కరించింది
మీకు అధికారం కట్టబెట్టిన సబ్బండ వర్గాల తన్లాటను.
రూమీ టోపీ నుంచి , గాంధీ టోపీ దాకా , ఆ నుంచి ఏ ఎండకాగొడుగు పట్టేదాకా సాగిన మీ ప్రయాణం
కూచున్న కొమ్మనే నరికేసుకునే , మీ దుర్మార్గానికి తెగబడ్డది..బాయిల బడ్డ కుక్క తీయ బోయిన కరువొస్తదట.. అట్లున్నది మీ అభద్రత..
మీ కబంధ హస్తాల్లో చిక్కిన కాంగ్రెస్ ను ఎవ్వడూ కాపాడలేడిప్పుడూ, స్వాతంత్ర్యాన్ని తెచ్చి
జాతిని విముక్తం చేసిన , మూడురంగుల జెండాను నేడు , ఒక తెలంగాణ ఫ్యూడల్ భూస్వామ్య కులం చెరబట్టింది.
నాడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన చేతులే నేడు అన్యాయమని ఎలుగెత్తిన గొంతులను బహిష్కరిస్తున్నాయి.. తస్మాత్ జాగ్రత్త… తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ రాశారు ఓ అజ్జాత కవి. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో.