బలగం మొగిలయ్య కన్నుమూత
గొప్ప కళాకారుడిని కోల్పోయిన తెలంగాణ
వరంగల్ జిల్లా – ప్రముఖ నటుడు, దర్శకుడు వేణు తీసిన బలగం చిత్రంలో గుర్తింపు తెచ్చుకున్న జానపద గాయకుడు మొగిలయ్య ఇక లేరు. కొంత కాలంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా తెల్లవారు జామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం దొగ్గొండి. తన భార్య కొమురమ్మతో కలిసి జానపద పాటలు పాడుతూ వచ్చారు.
బలగం చిత్రం ఊహించని రీతిలో జనాదరణ పొందింది. పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఎన్నో అవార్డులు లభించాయి. పాటలు పాడుతున్న మొగిలయ్యను గుర్తించి తన సినిమాలో పాడే ఛాన్స్ ఇచ్చాడు వేణు.
చిత్రం క్లైయిమాక్స్ లో వచ్చే సీన్ కు మొగిలయ్యతో పాట పాడించాడు. ఇది సెన్సేషన్ అయ్యింది. ఆ పాటను చూసిన వారంతా కంట తడి పెట్టారు. మొగిలయ్య దంపతులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఇంటి స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు.
మొగిలయ్య మరణంతో తెలంగాణ ప్రాంతం గొప్ప కళాకారుడిని కోల్పోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.