అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండి
వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫైర్
ఒంగోలు – వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరైనా తన నియోజకవర్గంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడినా లేదా డబ్బులు అడిగినా వారు తమ పార్టీకి చెందిన వారైనా సరే చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు.
పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తన లక్ష్యమని, ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తూ వచ్చానని కానీ కొందరు తనపై దుష్ప్రచారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి కొందరు కావాలని ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎవరైనా కుట్రలకు పాల్పడితే 25 వేల మందితో వాళ్ల ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎన్ని కేసులైనా సరే తనపై పెట్టుకోవాలని సవాల్ విసిరారు. పేదోళ్లకు ఇళ్లను కేటాయిస్తే తప్పుగా వార్తలు రాస్తే ఎలా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే.
ఒంగోలు నియోజకవర్గంలో నిరుపేదలైన 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గు చేటు అని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 25 లోపు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.