స్పష్టం చేసిన బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను శుక్రవారం గ్రూప్ 1 అభ్యర్థులు కలిశారు. ఈ సందర్బంగా వినతి పత్రం ఇచ్చిన అభ్యర్థులకు పూర్తి భరోసా ఇచ్చారు. తమ పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ కావాలని కక్ష కట్టడం మంచి పద్దతి కాదన్నారు. ఇదే సమయంలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులు దాడులకు పాల్పడడం తనను కలిచి వేసిందన్నారు బండి సంజయ్ కుమార్.
ఈ ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేది తేలి పోయిందన్నారు. ఇది తెలంగాణలో పూర్తిగా రుజువైందన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయడంపై సహాయం చేయాలని కోరారని, వారికి పూర్తి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్ కుమార్.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఏ విధంగా దెబ్బ తీస్తుందో జీఓ29యే నిదర్శనమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. గ్రూప్1 జాబ్ అభ్యర్థులకు బీజేపీ మద్దతు ఇస్తుందని, గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసే వరకు పోరాడుతుందని ప్రకటించారు కేంద్ర మంత్రి.
యువత రక్తం చూసిన ప్రభుత్వం ఎప్పటికీ నిలదొక్కుకోదని హెచ్చరించారు. ఇది తప్పని, యువతపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్ కుమార్.