ఏం సాధించారని సంబురాలు..?
ఎద్దేవా చేసిన కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అబద్దపు హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మరోసారి రైతులను నిట్ట నిలువునా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తొలి విడతలో లక్ష వరకే రుణాలు మాఫీ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటుందని నిలదీశారు బండి సంజయ్ కుమార్.
రబీ మరియు ఖరీఫ్ సీజన్లలో వాగ్దానం చేసిన రైతు భరోసా మొత్తాన్ని పంపిణీ చేయడంలో విఫలమైనందుకా? ..రుణ మాఫీపై ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేయడమేనా మీరు సాధించిందంటూ ఎద్దేవా చేశారు.
పంట నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను కష్టాల్లోకి నెట్టడమేనా?.. కేవలం రాబోయే ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ రుణ మాఫీ డ్రామా ఆడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బండి సంజయ్ కుమార్.
రైతు భరోసా కింద రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు, కౌలు రైతులకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 ఎందుకు అందించ లేదని ప్రశ్నించారు.