నామినేషన్ వేసిన బండి
వెంట ఉన్న కిషన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ గురువారం బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన ఎన్నికల పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేశారు.
ఆయన వెంట బీజేపీ చీఫ్ , కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు, లాయర్ కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ధర్మం కోసం ప్రజలు తన వైపు నిలబడతారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
పార్టీ చీఫ్ గా సేవలు అందించానని, ఎంపీగా ప్రజల మధ్యనే ఉన్నానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశానని చెప్పారు బండి సంజయ్ కుమార్ పటేల్. తాను గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో జనాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం చేసిందన్నారు. ప్రస్తుతం జనం వారిని నమ్మే స్థితిలో లేరన్నారు సిట్టింగ్ ఎంపీ.