బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్
సిరిసిల్ల జిల్లా – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో కాలి పోయిన తాటి చెట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా గౌడన్నలతో సంభాషించారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చేతులెత్తేసిందని ఆరోపించారు. ఇవాళ గౌడ కార్మికులు దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారని ఆవేదన చెందారు.
రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులు కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్న సోయి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
గౌడన్నల ఆత్మ గౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పారని ఆరోపించారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.