ఏపీ అభివృద్దికి కేంద్రం సహకారం – బండి
ఆత్మ నిర్భర్ భారత్ తో దేశం స్వయం సమృద్ది
విశాఖపట్నం – ఆత్మ నిర్బర్ భారత్ తో దేశం స్వయం సమృద్దిని సాధించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీని గతంలో కంటే రెట్టింపు అభివృద్ది చేసుకుందామన్నారు. కేంద్రం అన్నివిధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
రాజకీయ గొడవలు, పంతాలు, పట్టింపులను వదిలి పెట్టాలని, కలిసికట్టుగా పని చేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్ కుమార్ .2028 నాటికి ఆర్ధిక ప్రగతిలో 3వ స్థానానికి భారత్ చేరుకోవడం తథ్యం అన్నారు.
ఎన్ని విమర్శలొచ్చినా లక్ష్యసాధన కోసం పాటుపడుతున్న మహనీయుడు నరేంద్ర మోదీ అన్నారు.
ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు కేంద్ర మంత్రి.ప్రైవేట్, కార్పొరేట్ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
వైజాగ్ ‘‘రోజ్ గార్ మేళా’’లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి ఉద్యోగ నియామకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
వైజాగ్ పరిధిలో 110 మందికి అపాయిట్ మెంట్ లెటర్స్ అందించారు కేంద్ర మంత్రి. ఏ విభాగంలోనైనా ఖాళీలుంటే ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆ పరిస్థితి రాకూడదనే వెంట వెంటనే భర్తీ చేస్తున్నామన్నారు.