NEWSTELANGANA

జ‌ర్న‌లిస్టుల‌కు ఇండ్లు ఇవ్వాలి – బండి

Share it with your family & friends

వారివి చాలీ చాల‌ని బ‌తుకులని ఆవేద‌న

హైద‌రాబాద్ – కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌ర్న‌లిస్టుల‌కు సంబంధించి హౌసింగ్ సొసైటీల‌ను ర‌ద్దు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించ‌డం ప‌ట్ల స్పందించారు. కోర్టు తీర్పును గౌర‌విస్తున్నాన‌ని, అయితే మాన‌వ‌తా దృక్ఫ‌థంతో రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల పట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమ‌ని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కక పోవడానికి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం అని ఆరోపించారు బండి .

17 ఏళ్ల క్రితం పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి ఒక్కో జర్నలిస్టు రూ.2 లక్షల చొప్పున రూ.12 కోట్లు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లించి హౌజింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒక సాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో జర్నలిస్టుల బతుకులు మరీ దుర్భరమ‌ని వాపోయారు. ఇండ్ల స్థలాలడిగితే లాఠీలతో కొట్టించారని, .ప్రశ్నించే జర్నలిస్టులను వృత్తిలో కొన‌సాగ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని మండిప‌డ్డారు.

నేటి సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల నిర్వాక, నిర్లక్ష్య ఫలితమే త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ఈ రెండు పార్టీలు జర్నలిస్టులను రోడ్డు పాల్జేయడమే కాకుండా చేతికొస్తుందని వేయికళ్లతో ఎదురు చూసిన ఇండ్ల స్థలాలను చేతికి అందకుండా చేశాయని ధ్వ‌జ‌మెత్తారు బండి సంజ‌య్ కుమార్. జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకున్నాయంటూ వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టు కుటుంబాల బాధ వర్ణణాతీతం. అసలు జర్నలిస్టుల చేసిన తప్పేమిటి? ఈ రెండు పార్టీలకు జర్నలిస్టులపై ఎందుకంత కక్ష? పైసాపైసా కూడబెట్టి డబ్బులు చెల్లించినా ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా 17 ఏళ్లు జాప్యం చేస్తారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నేటి సమాజంలో జర్నలిస్టుల సేవలు వెల కట్టలేనివి. చాలీచాలని జీతాలతో బతుకీడుస్తున్నారు. అయినా తమ వార్తలతో నిరంతరం సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు అహర్నిశలు తపన పడతున్నారు.

ఇకనైనా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల‌ని కోరారు.