నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గద్దర్ ను వాడుకుని వదిలేసింది కాంగ్రెస్ పార్టీనేనని, అది తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. పద్మ అవార్డు ఇవ్వక పోతే దానికి అనేక కారణాలు ఉంటాయని పనిగట్టుకుని తమ మీద నిందలు మోపితే ఎలా అని ప్రశ్నించారు. సీఎం ప్రతీకార చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ ను జీవితాంతం అవమానించింది మీ పార్టీనేనని సంచలన ఆరోపణలు చేశారు.
గద్దర్‌ను మధ్యవర్తిగా వాడుకుని, నక్సల్స్‌ను సమావేశానికి పిలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్ పటేల్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
గద్దర్ పై యూఏపీఏ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని, ఆయనపై ఏకంగా 21 కేసులు పెట్టింది మీ సర్కార్ హయాంలోనేనని ఆరోపించారు కేంద్ర మంత్రి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేలా చేసింది మీరే కాదా అని నిలదీశారు.
దుద్దిళ్ల శ్రీపాద రావు, చిట్టెం నరసింహ రెడ్డి వంటి నాయకులు, ఐపిఎస్ అధికారులు , లెక్కలేనన్ని పోలీసు కుటుంబాలు నక్సలిజం బాధితులుగా మారారని అన్నారు. ఓ వీధికి గద్దర్ పేరు పెడితే తాము ఒప్పుకోమన్నారు. ఒకవేళ పేరు మార్చాలని అనుకుంటే ముందుగా హైద్రాబాద్ ను భాగ్య నగరంగా, నిజామాబాద్ ను ఇందరూరుగా, మీ స్వంత జిల్లా మహబూబ్ నగర్ ను పాలమూరుగా మార్చాలని డిమాండ్ చేశారు.