ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవు
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు బండిపై. ఆయన వల్లనే బీజేపీ బలం పెరగ లేదని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా తాను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తనకు ఎవరి పట్ల కోపం లేదన్నారు. ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. తన వల్లనే పార్టీ ఉందని తాను ఎప్పుడూ చెప్పలేదని చెప్పారు. తాను ఉన్నా లేకున్నా బీజేపీ ఉంటుందని పేర్కొన్నారు.
తమ నేతలపై కామెంట్ చేసే సంస్కార హీనుడిని కానని తెలిపారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడి పని చేసిన నేతలు, కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.
తాను కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, కానీ ఏనాడూ పార్టీని వీడాలని అనుకోవడం లేదన్నారు. అయితే ఈ సమయంలో కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని, ఇది తనను ఎంతో బాధకు గురి చేస్తోందన్నారు.