కాంగ్రెస్..బీఆర్ఎస్ ఒక్కటే
బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ను ఏకి పారేస్తున్నారు. ఆచరణకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు బండి సంజయ్ కుమార్.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల కంటే ముందు ఊదర గొట్టారని ఇప్పుడు దానిని పక్కన పెట్టారని ఆరోపించారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి తాను ఏం చేస్తున్నాడో తనకేమైనా తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారిగా కుమ్మక్కు అయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేక పోయారంటూ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అయ్యాయంటూ ప్రచారం చేశారని, ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు బండి సంజయ్ కుమార్ పటేల్.